ప్రశాంత్ కిషోర్ మందు స్ట్రాటజీ.. గంటలో నిషేధం ఎత్తేస్తారట!

Prasanth Kishore

ఏమండోయ్.. ఇది విన్నారా? మన ప్రశాంత్ కిషోర్ గారు  ‘‘మా గవర్నమెంట్ వచ్చిన గంటలో మద్య నిషేధం ఎత్తేస్తాం’’ అంటున్నారు. ఆ మాట విన్న వెంటనే.. టాక్స్ పేయర్స్ అదేనండీ మన తాగుబోతు వీరుల మదిలో గాజుసీసాల గలగలల సవ్వడి సందడి చేసేస్తోంది. ఒక్కసారిగా బీహార్ మందు ప్రియులందరికీ.. మద్యం గుడులు.. తీర్థం గ్లాసులూ కలల్లోకి  వచ్చేసి.. నిద్ర పట్టడం మానేసింది. త్వరలోనే తమ కలలు నెరవేరుతాయనే సంబరం అందరిలో పొంగిపోతోంది. 

ఇంతకీ.. ఈ ప్రశాంత కిషోర్ గారు.. పార్టీలను పదవుల్లోకి తీసుకొచ్చే పనికి కామా పెట్టి.. తానే నేతాశ్రీ అయిపోవాలని రెడీ అయిపోయారు. దానికోసం ఈ మధ్యే కొత్త పార్టీ పుట్టించారట ‘జన్ సురాజ్’ అంటూ. ఇప్పుడు  ఈయన  గారు పార్టీని లాంచ్ చేసి, రాజకీయాల్లోకి గట్టిగా దూసుకెళ్లాలని తన స్కెచ్ తానే వేసేసుకున్నారు.  రాజకీయాలు అంటే ఏదో కత్తులు, రైట్లు, కమీషన్లు మాత్రమే కాదు. ఇంకా చాలా ఉంటాయి కదా.  అప్పట్లో ఓ సీనియర్ రాజకీయ పండితుడు చెప్పినట్టు, ‘‘ప్రజలకెప్పుడూ పక్కన ఒక సీసా ఉంటే చాలు!’’ అనే ఫిలాసఫీ బాగా నెత్తికెక్కినట్టుంది మన ప్రశాంత్ కిషోర్ గారికి. 

ఇక నితీశ్ కుమార్ గారు, తేజస్వీ యాదవ్ గారు గత 30 ఏళ్లుగా బీహార్‌లో ఏదో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లా కుర్చీ దక్కించుకుంటున్నారనేది ప్రశాంత్ కిషోర్ గారి భావన. ” గత ప్రభుత్వాలు ఎంత శ్రమించినా..  ఎన్ని నిషేధాలు పెట్టినా, బీహార్ అంతకంత పానీయ పరవశంలోకి దిగిపోయింది!” అనేది ప్రశాంత్ గారి నిశ్చితాభిప్రాయం. అంటే ఇంక ప్రజలకు కళ్ళెం వేసే  పనిలేదు. ఇప్పటికే జనం పీకల్లోతు తాగుబోతుల్లా  మారిపోయారు. ఈ పరిస్థితుల్లో, ఈ రాజకీయ బేహారి మాటలతో వాళ్లకు ఒక గట్టి కిక్కొచ్చేలా ఉంది!

నిజానికి 2016లో మద్యం నిషేధం పెట్టారు.  కానీ, దాని వల్ల ఎవరికి లాభం? అక్రమ మద్యం అమ్మే వాళ్లకు బీహార్ మొత్తం సింగపూర్ లా మారిపోయింది. ‘‘చెట్టు ఎక్కడ ఎత్తు పెరిగితే, దానికింద వ్యాపారం అక్కడే మొదలవుతుంది’’ అన్నట్టు, మద్యం నిషేధం ఎత్తివేస్తే  దాని మ్యాజిక్ మరింత మందు మీద పిచ్చి పెరిగేలా చేసిందనిపిస్తోంది. 

సరే అదలా ఉంచితే.. ఇప్పుడు మన కిషోర్ గారు ఏదో మద్య నిషేధం తీయడం అంటే బీహార్ ప్రజల అన్ని సమస్యలు అవుట్ అయిపోతాయని అనుకుంటున్నారరేమో.. లేదా ప్రజల ఓట్లు తీసుకుని వారిని మద్యం మత్తులో అవుట్ చేసి అధికారం కొట్టేయవచ్చని లెక్కలు వేస్తున్నారేమో. ఈయనగారు ఎప్పుడైతే నిషేధం ఎత్తేస్తామన్నారో, అందరూ తాగుబోతుల మినీ కదంబం ఫుల్లుగా వేరే లెవల్లో ఉండేలా తన హామీతో మతిపోగొట్టే ప్లాన్ చేస్తున్నారు.

మొత్తానికి, ఈ హామీల  విప్లవం తాలూకు ఫలితాలు ఎలా ఉంటాయో తరువాత  అర్థమవుతుందేమో, కానీ ఒకటి మాత్రం ఖాయం. ప్రశాంత్ కిషోర్ అధికారంలోకి వస్తే ఓ గంటలో రాష్ట్రం గ్లాసుల మోతతో  నిండిపోతుంది!” ఘల్లు మంది గ్లాసు..  అంటూ బీహారీయులంతా సంబరాలు చేసుకుంటారేమో చూడాలి!

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page